Apr 10, 2008

వెబ్ ప్రపంచంలో మీ ఏకీకృత గుర్తింపు కార్డు: ఓపెన్‍ఐడీ

యాహూ, హాట్‍మెయిల్, రీడిఫ్, జీమెయిల్, లైవ్‍జర్నల్, నౌక్రీ, యూట్యూబ్, ఫేస్‍బుక్, లింక్డ్‍యిన్... యిలా కన్పించిన ప్రతి సైట్ లోనూ ఖాతా తెరిచేయడం... ఆనక ఏ సైట్ లో యే పేరుతో నమోదు చేసుకున్నామో మర్చిపోవటం... ఒకవేళ అది గుర్తున్నా పాస్‍వర్డ్ గుర్తురాక ముప్పుతిప్పలు పడటం ఇంటర్నెట్‍‍తో పరిచయమున్న వారందరికీ ఉండే అనుభవమే. అన్ని సైట్లలోనూ ఒకే పేరూ, ఒకే పాస్‍వర్డ్ వాడుకోవచ్చుగానీ అది అన్ని వేళలా సాధ్యం కాదు, అయినా అంత శ్రేయస్కరమూ కాదు: ఇంటర్నెట్ బ్యాంకింగ్‍కి వాడుతున్న పాస్‍వర్డ్ నే ఊరూ-పేరూ తెలియని సైట్‍కి అప్పజెప్పలేం కదా. ఒకవేళ మనం అందుకు సిద్ధపడ్డా ఆయా సైట్‍లలోని నిబంధనలను బట్టి అంకెలూ, ప్రత్యేకాక్షరాలూ, అదనపు అక్షరాలూ ఉన్నఅష్టావక్ర పాస్‍వర్డ్‍లు తయారుచేసుకోవల్సి వస్తుంటుంది. ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు కొన్ని సైట్లు పక్షానికోసారి బలవంతంగా పాస్‍వర్డ్ మార్పించేస్తుంటాయ్!

మూడు యూజర్‍నేములూ ఆరు పాస్‍వర్డ్‍లుగా వర్ధిల్లుతున్న ఈ సమస్యకు పరిష్కారం ఓపెన్‍ఐడీ (OpenID). ఇది వెబ్ ప్రపంచంలో మీ ఏకీకృత గుర్తింపు కార్డు లాంటిది. అన్ని వెబ్‍సైట్‍లూ ఓపెన్‍ఐడీని స్వీకరించటం మొదలుపెడితే యిక సైటుకో ఖాతా తెరిచే సాంప్రదాయ లాగిన్ విధానం కథ ముగిసినట్లే.

యిక యే సైట్‍కెళ్ళినా మీ ఓపెన్‍ఐడీ (మీ సొంత సైట్ లేదా బ్లాగ్ యొక్క URL) టైప్ చేసి నేరుగా లాగిన్ అయిపోవచ్చు. ఓపెన్‍ఐడీతో లాగిన్ అయినప్పుడు సదరు సైట్ మీ సొంత సైట్‍ని (లేదా మీ ఓపెన్‍ఐడీ ప్రదాత సైట్‍ని) సంప్రదించి, అక్కణ్ణుంచి మీరెవరనే విషయాన్ని రూఢి చేసుకుంటుంది (లేదా మీరు మీరేనని ధృవపరుచుకుంటుంది). మీ యూజర్‍నేమ్‍ గానీ పాస్‍వర్డ్ గానీ తీసుకోదు. మీరు చేయవల్సిందల్లా మీ సొంత సైట్‍లో లాగిన్ అవ్వటమే (ఈ ఒక్క యూజర్‍నేమ్‍/పాస్‍వర్డ్ గుర్తుంచుకుంటే చాలు!).

ఓపెన్‍ఐడీ పొందటం ఎలా?
మీ సైట్‍లోని మొదటిపేజీ‍లో (సాధారణంగా index.html అని ఉంటుంది) <head> tag లోపల మీ ఓపెన్‍ఐడీ ప్రదాత సర్వర్ చిరునామా తెలియపరుస్తూ ఒక <link> tag రాయాలి. ఒకవేళ మీ ఓపెన్‍ఐడీని వేరొక సైట్‍తో అనుసంధానం ద్వారా తెచ్చుకోదల్చినట్లయితే సదరు సైట్ వెబ్ అడ్రస్‍ని పేర్కొంటూ మరొక <link> tag రాసి ఆ పేజ్‍ని సేవ్ చెయ్యాలి. అంతే, విశ్వ వ్యాప్త వెబ్‍లో మీ సొంత గుర్తింపు సిధ్ధం. యిక ఓపెన్‍ఐడీని స్వీకరించే సైట్‍‍కెళ్ళి మీ సైట్ లేదా బ్లాగ్ URL టైప్ చెయ్యటమే తరువాయి. అది ఆఘమేఘాల మీద మీ సొంత సైట్‍కి తీసుకొచ్చి లాగిన్ అవ్వమంటుంది. యూజర్‍నేమ్‍/పాస్‍వర్డ్‍తో మీరు లాగిన్ అయిన వెంటనే మీ గుర్తింపును ధృవపరుస్తూ సదరు సైట్‍కి ఒక వర్తమానం వెళ్తుంది. సైటుకో పాస్‍వర్డ్ అవసరం లేకుండా మీ లాగిన్ ప్రక్రియ సవ్యంగా పూర్తవుతుంది. చాలా బావుంది కదూ! యిప్పుడొక ఉదాహరణ చూద్దాం.

బ్లాగర్‍‍లో మీకొక బ్లాగ్ ఉంటే, యిప్పటికే మీకొక ఓపెన్‍ఐడీ‌ఉన్నట్లే. ఓపెన్‍ఐడీ స్వీకరించే యే సైట్‍లోనైనా లాగిన్ అవ్వడానికి మీ బ్లాగ్ URL టైప్ చేస్తే చాలు. ఉదాహరణ పిబివికి సైట్‍లో (https://my.pbwiki.com/?p=openid) మీ బ్లాగ్ అడ్రస్ టైప్ చేయండి. ఇప్పుడు మీరు మీరు బ్లాగర్ సైట్‍కి మళ్ళించబడతారు. యిక్కడ మీ అనుమతి తెలియజేయగానే, పిబివికీలో మీ లాగిన్ ఖరారు. ఇంత సులువా? అవును!

ఒకవేళ బ్లాగర్ చిరునామానే ఓపెన్‍ఐడీగా వాడుతూ ఏదో కారణం వల్ల లైవ్‍జర్నల్‍ని ఓపెన్‍ఐడీ ప్రదాతగా వాడదల్చుకున్నారనుకుందాం, అప్పుడు, బ్లాగర్‍లో లాగిన్ అయ్యి:
Dashboard --> Layout --> Edit HTML కి వెళ్ళి, అక్కడ <head> tag క్రింద


<link rel="openid.server" href="http://www.livejournal.com/openid/server.bml">

<link rel="openid.delegate" href="http://okati.livejournal.com/">

అని టైప్ చేసి సేవ్ చెయ్యాలి. యిప్పుడు బ్లాగర్ అడ్రస్‍తో లాగిన్ అయినా, లైవ్‍జర్నల్ నుంచి ధృవీకరణ జరుగుతుంది. పై ఉదాహరణలో నేను http://okati.livejournal.com/ అని వాడిన చోట మీ లైవ్‍జర్నల్ చిరునామా వాడాల్సి ఉంటుంది.

మీ ఓపెన్‍ఐడీ verisign లాంటి ఇంటర్నెట్ భద్రతా స్పెషలిస్ట్‍ల వద్ద నుంచి కూడా పొందవచ్చు. అప్పుడు http://www.livejournal.com/openid/server.bml స్థానంలో వారి ఓపెన్‍ఐడీ సర్వర్ చిరునామా టైప్ చెయ్యాలి. అలాగే http://okati.livejournal.com/ స్థానంలో వాళ్ళిచ్చిన సైట్ అడ్రస్ టైప్ చెయ్యాలి.

మీ ఓపెన్‍ఐడీ సిధ్ధం. యిక అన్ని సైట్‍లూ ఓపెన్‍ఐడీని స్వీకరించే మంచి రోజుల కోసం ఎదురుచూడటమే!
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సైట్‍లు చూడండి:‌
ఓపెన్‍ఐడీ కథా-కమామీషు:
http://openid.net

ఓపెన్‍ఐడీని ఎవరెవరు స్వీకరిస్తున్నారు:‌
https://www.myopenid.com/directory
http://openiddirectory.com/

ఓపెన్‍ఐడీ ప్రదాతలెవరెవరు?:‌
http://openid.net/get/